Display:
శృంగార సంకీర్తన
రేకు: 90-2
సంపుటము: 5-351
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎడయాట మాటల నేచిన వలపు
పొడమిన యాసల పొద్దొక వలపు
॥పల్లవి॥
వేఁకమైన కోరికె వినుకలి వలపు
కాఁకలఁ బొరలుటెల్లఁ గనుచూపువలపు
మూఁకలైన తలఁపులు ముదినవలపు
ఆఁకలిదీరని పొందులడియాసవలపు
॥ఎడ॥
నడురేయి గమనము నాఁటినవలపు
విడువనితాపము వేఁడివేఁడివలపు
తడఁబాటు తానౌట తలఁపనివలపు
నిడివేఁడి యూర్పులు నెట్టుకొన్నవలపు
॥ఎడ॥
తిరువేంకటేశుపై తిరమైనవలపు
సరసరీతులచేత సరిలేనివలపు
గురుతైన రచనలు కూడినవలపస
తరుణికి నతనికిఁ దగులైన వలపు
॥ఎడ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము