శృంగార సంకీర్తన
రేకు: 91-5
సంపుటము: 5-360
రేకు: 91-5
సంపుటము: 5-360
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: అమరసింధు
| తలఁచిన దేహము నిలువదు తా ననుఁ దలఁచునొ తలఁచఁడొ వలనుగఁ జెలిమాటలు విని వచ్చీనో రాఁడో | ॥పల్లవి॥ |
| శిరసున నంటిన పునుఁగిటు చెక్కుల జారెడిననుచును ఉరవడిఁ దివియుచుఁ గొనగోరూఁదిన చందములు మురిపెపు మొలనూళ్ళపై మొగపుల సొబగులు చూచుచు- నరుదుగ గరమున నక్కడ నంటెడి యాసలును | ॥తలఁచిన॥ |
| చెనకుల వీడెపురసమిదె సెలవులఁ జెదరెడిననుచును నునుపగు గోళ్ళ వాతెర నొక్కినచందములు పెనగొను ముత్యపుసరముల పెక్కువ దీర్చెదననుచును చనవునఁ జనుఁగవపై జే చాఁచిన చందములు | ॥తలఁచిన॥ |
| వుద్దపు నడపులలోపల నొయ్యన పాదము జారిన- నొద్దికతో నునుఁగౌఁగిట నొరసిన చందములు నిద్దపుఁ దిరువేంకటగిరినిలయుఁడు ననుఁ దనకౌఁగిట- నద్దిన కస్తూరిచెమటల నలమిన చందములు | ॥తలఁచిన॥ |


