Display:
శృంగార సంకీర్తన
రేకు: 92-3
సంపుటము: 5-364
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
చాలుఁ జాలు నీతోడి సరసాలు యిట్టె
పాలిండ్ల కొంగుజారి బయటఁ బడితిమి
॥పల్లవి॥
సిగ్గువడితిమిర నీ చేసిన చేఁతలకు-
నగ్గమైతిమిర మరునమ్ములకును
దగ్గరి నీకాఁకలఁ దగులఁబట్టి నేఁడు
బగ్గన నిందరిలోనఁ బలచనైతిమి
॥చాలు॥
నొగిలితిమిర నేము నోఁచిన నోములకు
పొగిలితిమిర నీపొందులకును
తెగి నీవు నన్ను రతిఁదేలించి తేలించి నాకు
పగటు బిగువులెల్లఁ బచ్చిగాఁ జేసితివి
॥చాలు॥
దప్పిఁ బడితిమిర నీతాలిములనే కడు
నొప్పిఁ బడితిమీర నీ నొక్కుఁజేఁతల
ఇప్పుడిట్టె తిరువేంకటేశుఁడ నీవు నా-
కొప్పు సవరము దీసి కొల్లగొంటి మానము
॥చాలు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము