Display:
శృంగార సంకీర్తన
రేకు: 93-2
సంపుటము: 5-369
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
వంచిన పన్నీటఁ బో వాడె నీ మోము
మంచునఁ దామెరసొంపు మాయుఁగదవే
॥పల్లవి॥
సంపెంగ నూనియనే మజ్జనము సేయఁగఁ బో
చెంపజారి తురుమెల్లఁ జెదరీ నేఁడు
గుంపులైన తుమ్మిదలు కొమ్మ నీయలకలివి
రంపపుఁగంపునకు వెరచుఁగదవే
॥వంచిన॥
జవ్వాది యెప్పుడు నీ నొసల మెత్తఁగానె పో
యెవ్వరు నిలిచిన నోరెత్తవు నేఁడు
కొవ్విన చిలుకపలుకులు దీనిగాలికి
దవ్వుదవ్వులనె కడు దాఁగుఁగదవే
॥వంచిన॥
ఒక్కటై వేంకటవిభుఁడొత్తినరేఖలఁ బో
చక్కని నీచనుఁ గొంగు జారీ నేఁడు
జక్కవపులుగులివి చందురుఁడుదయమైన
వుక్కమీరి బెదరుచునుండుఁ గదవే
॥వంచిన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము