Display:
శృంగార సంకీర్తన
రేకు: 94-2
సంపుటము: 5-375
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఎంత సేయఁగ నేరదింతి గోపించినను
కంతుని గెలిపించెను ఘనుఁడైన విభుని
॥పల్లవి॥
సతవింత తాపాన చందురుఁడేఁపఁగఁ బో
ప్రతిచందురుండాయ పడఁతిమోము
అతివఁ గోవిలకూఁతలలయించఁగాఁ బో
తతిఁ గోవిలలకూఁత తానాయఁ బలుకు
॥ఎంత॥
మలయానిలుఁడు దన్ను మలసి యేఁచఁగఁ బో
చెలివూర్పు చిరుగాలిఁ జిత్రెంచెను
తలపోఁతచింత చిత్తము సేయఁగాఁ బో
కలికిచిత్తము పతికడకంటెనిపుడు
॥ఎంత॥
తిరుగఁ జంద్రుఁడు తన్ను తిలకించగాఁ బో
ధరియించెఁ గుచముల తానతని
తిరువేంకటగిరిదేవునికౌఁగిటి-
సిరులఁబో యిన్నిటాఁ జెలువాయె నిపుడు
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము