Display:
శృంగార సంకీర్తన
రేకు: 42-6
సంపుటము: 6-6
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఒక్కలాగువాఁడవా యోరి యిట్టి
తక్కులం బెట్టితి నన్నుఁ దగిలించి నీవు
॥పల్లవి॥
తెలిసితిమిలే తెప్ప తిరుణాళ్లనాఁటి
జలముల నామీఁద జల్లుతానే
సొలపుం జూపుల నిట్టె సొంపుగఁ జూచి చూచి
వలపు జల్లితివి యెవ్వతె పైనోరి
॥ఒక్క॥
కంటిమి నీలాగుగ్రక్కనఁ దిరువీథుల
నింటి ముంగిటను నీ వేఁగుతానే
వెంటనె యాలవట్టము విసరేటి సతి గుబ్బ
చంటిమీఁద నొరగి వేసాలఁ బోతివో
॥ఒక్క॥
ఇన్నియు మెచ్చితిరా నిన్నింతలోనె యిప్పుడు నీ
వున్న పైఁడియుయ్యాల నీ వూగుతానే
మన్నవ కౌఁగిట నన్ను మరపించి యెక్కడికొ
కన్నులార్చితివి వేంకటరాయ యోరి
॥ఒక్క॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము