అధ్యాత్మ సంకీర్తన
రేకు: 5-2
సంపుటము: 1-30
రేకు: 5-2
సంపుటము: 1-30
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఆలాగు పొందులును నటువంటి కూటములు యీలాగు లౌట నే డిదె చూడనయితి | ॥ఆలాగు॥ |
| అడియాస చూపులకు నాసగించితిఁ గాని [1]వెడమాయలని లోను వెదకలేనైతి కడువేడుకలఁ దగిలి గాసిఁ బొందితిఁ గాని యెడలేని పరితాప మెఱఁగలేనైతి | ॥ఆలాగు॥ |
| చిరునగవు మాటలకుఁ జిత్తగించితిఁ గాని తరితీపులని లోనుఁ దలఁపలేనైతి వరుస మోహపుఁ బసల వలలఁ జిక్కితిఁ గాని గరువంపుఁ బొలయలుక గానలేనైతి | ॥ఆలాగు॥ |
| శ్రీవేంకటేశ్వరునిఁ జింత సేసితిఁ గాని దేవోత్తముని లాగుఁ దెలియలేనైతి యీ వైభవముపై నిచ్చగించితిఁ గాని యీ వైభవానంద మిది పొందనైతి | ॥ఆలాగు॥ |
[1] ‘వెడమాయ లనిలోను’ అని పూ.ము. పాఠపదవిభాగము.


