అధ్యాత్మ సంకీర్తన
రేకు: 5-3
సంపుటము: 1-32
రేకు: 5-3
సంపుటము: 1-32
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| ఎంతటివారలు నెవ్వరును హరిఁ జింతించక నిశ్చింతులు గారు | ॥ఎంతటి॥ |
| అతిజితేంద్రియులు ననశనవ్రతులు నతులతపోధనులగువారు చతురానన గురుస్మరణము దొరకక తతి నూరక పుణ్యతములు గారు | ॥ఎంతటి॥ |
| అనఘులు శాంతులు నధ్యాత్మతతులు ననుపమపుణ్యులు యాజకులు వనజోదరు ననవరతముఁ దలఁచక వినుతిస్మృతికిని విబుధులు గారు | ॥ఎంతటి॥ |
| దురితవిదూరులు దుర్మతిహీనులు నిరతానందులు నిత్యులును తిరువేంకటగిరిదేవుని గొలువక పరమార్గమునకు బ్రహ్మలు గారు | ॥ఎంతటి॥ |


