అధ్యాత్మ సంకీర్తన
రేకు: 5-4
సంపుటము: 1-33
రేకు: 5-4
సంపుటము: 1-33
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| పరమపాతకుఁడ భవబంధుఁడ శ్రీ- హరి నినుఁ దలఁచ నే నరుహుఁడనా | ॥పరమ॥ |
| అపవిత్రుఁడ నే నమంగళుఁడఁ గడు- నపగతపుణ్యుఁడ [1]నలసుఁడను కపటకలుషపరికరహృదయుఁడ నే- నపవర్గమునకు నరుహుఁడనా | ॥పరమ॥ |
| అతిదుష్టుఁడ నే నధికదూషితుఁడ హతవివేకమతి [2]నదయుఁడను [3]పతిలేని రమాపతి మిముఁ దలఁచలే- నతులగతికి నే నరుహుఁడనా | ॥పరమ॥ |
| అనుపమవిషయపరాధీనుఁడ నే- ననంతమోహభయాతురుఁడ వినుతింపఁగ దిరువేంకటేశ ఘను- లనఘులు గాక నే నరుహుఁడనా | ॥పరమ॥ |
[1][2] ‘సలసుఁడను’ ‘సదయుఁడను’ అని పూ.ము.పా.
[3] ‘సతి’ ప్రతిశబ్దభవము కావచ్చు.


