Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 67-3
సంపుటము: 1-348
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఏఁటిబ్రదుకు యేఁటిబ్రదుకు । వొక్క-
మాటలోనే యటమటమైన బ్రదుకు
॥ఏఁటి॥
సంతకూటములే చవులయిన బ్రతుకు
దొంతిభయములతోడి బ్రదుకు
ముంతనీళ్ళనే మునిఁగేటి బ్రదుకు
వంతఁ బొరలి కడవరం[1] లేని బ్రదుకు
॥ఏఁటి॥
మనసు చంచలమే మనువయిన బ్రదుకు
దినదినగండాలఁ దీరు బ్రదుకు
తనియ కాసలనె తగిలేటి బ్రదుకు
వెనకముందర చూడ వెరపయిన బ్రదుకు
॥ఏఁటి॥
[2]తెగి చేఁదె తీపయి తినియేటి బ్రదుకు
పగవారి పంచలపాలైన[3] బ్రదుకు
తగు వేంకటేశ్వరుఁ దలఁచని బ్రదుకు
పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు
॥ఏఁటి॥

[1] ‘కడవల’ కావచ్చు.

[2] ‘చెడి’ పూ.ము.పా. ప్రాసభంగము, యతిభంగము.

[3] (నిడురేకు 53) పాలిబ్రదుకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము