అధ్యాత్మ సంకీర్తన
రేకు: 67-6
సంపుటము: 1-351
రేకు: 67-6
సంపుటము: 1-351
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| అందరి కాధారమైన ఆదిపురుషుఁ డీతఁడు విందై మున్నారగించె విదురునికడ నీతఁడు | ॥అందరి॥ |
| సనకాదులు గొనియాడెడి సర్వాత్మకుఁ డీతఁడు వనజభవాదులకును దైవంబైనతఁ డీతఁడు యినమండలమునఁ జెలఁగేటి హితవైభవుఁ డీతఁడు మునువుట్టిన[1] దేవతలకు మూలభూతి యీతఁడు | ॥అందరి॥ |
| సిరులొసఁగి యశోదయింట శిశువైనతఁ డీతఁడు ధర నావులమందలలో తగఁ జరించె నీతఁడు సరసతలను గొల్లెతలకుఁ జనవులొసఁగె నీతఁడు అరసి కుచేలునియడుకు లా[2]రగించె నీతఁడు | ॥అందరి॥ |
| పంకజభవునకును బ్రహ్మపద మొసఁగెను యీతఁడు సంకీర్తన లాద్యులచే జట్టిగొనియె నీతఁడు తెంకిగ నేకాలముఁ బరదేవుఁడయిన యీతఁడు వేంకటగిరిమీఁద బ్రభల వెలసిన ఘనుఁ డీతఁడు | ॥అందరి॥ |
[1] (నిడురేకు 70) ముట్టిన.
[2] (నిడురేకు 70) కులనార.


