Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 68-4
సంపుటము: 1-355
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
విశ్వప్రకాశునకు వెలి [1]యేడ లో నేడ
శాశ్వతున కూహింప జన్మమిఁక నేడ
॥విశ్వ॥
సర్వపరిపూర్ణునకు సంచారమిఁక నేడ
నిర్వాణమూర్తికిని నిలయమిఁక నేడ
వుర్వీధరునకుఁ గాలూఁద నొక చోటేడ
పార్వతీస్తుత్యునకు భావమిఁక నేడ
॥విశ్వ॥
నానాప్రభావునకు నడుమేడ మొదలేడ
ఆననసహస్రునకు నవ్వ లివ్వ లేడ
మౌనిహృదయస్థునకు మాటేడ పలుకేడ
జ్ఞానస్వరూపునకుఁ గాన విన నేడ
॥విశ్వ॥
పరమయోగీంద్రునకు పరులేడ తానేడ
దురితదూరునకు సంస్తుతినింద లేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహమేడ
హరికి నారాయణున కవుఁగాము లేడ
॥విశ్వ॥

[1] ‘యాడ’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము