Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 69-1
సంపుటము: 1-358
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
దొరుకునా యితని కృప తుదిపదంబు
అరిది విభవము లొల్లమని నాఁ బొదలు
॥దొరుకునా॥
సొంపలర నితఁడు కృపఁజూచు టరుదని కాక
యింపు సామాన్యమా యితని కరుణ
లంపటము ఘనమైన లక్ష్మీకటాక్షములు
సంపదలు తోడనే చల్లు వెదలాడు
॥దొరుకునా॥
తగ నితనిపై భక్తి తగులు టరుదని కాక
నగుట సామాన్యమా ననిచి యితఁడు
జగదేకహితములుగ సరసతలు సౌఖ్యములు
దిగులు వాయఁగ నితడు దిప్పు దీరాడు
॥దొరుకునా॥
తిరువేంకటాద్రి సిద్ధించు టరుదని కాక
[1]మరుగఁ దను నిచ్చునా మరియొకరిని
యిరవైన భోగములు యిష్టసామ్రాజ్యములు
విరివిగొని యితని దయ వెంటనే తిరుగు
॥దొరుకునా॥

[1] (నిడురేకు 2) ఇరవు సామాన్యమా యిందరికిని, సరిలేని విభవములు సరసతలు సౌఖ్యములు అరిది నీతని మహిమ నండనే వుండు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము