Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 69-2
సంపుటము: 1-359
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
[1]చెలి నేఁడు తానేమి సేయునమ్మ
చెలి యేమి సేయు నీ చెలులేమి సేయుదురు
చెలువైన విభు మేని చెలువింత సేయఁగా
॥చెలి॥
సతి నేఁడు బంగారుచవికెలోఁ జిత్రంపు-
గతు లెంత చూపినఁ గడకంటఁ జూడదు
అతనిఁ జూచిన మంచియబ్బురపుఁ జూపులు
అతని వెంటనే పోయ నటు గాఁబోలును
॥చెలి॥
తేనియలూరేటి మంచి తియ్యనిమాటలు మంత్ర-
గానములుగా వినుపించి కడు వేసరితిమి
వాని మాటలు విన్న వలనైన ముదమున
వీనులు ముద్రించిన విధము గాఁబోలును
॥చెలి॥
నిచ్చళపు మోమున నెయ్యము దైలువారె
బచ్చనచేఁతలు గుబ్బలపై నిండనొప్పెను
అచ్చపువేడుక వేంకటాద్రీశుఁ డీరేయి
నెచ్చెలికి నిచ్చినట్టి నేరుపు గాఁబోలును
॥చెలి॥

[1] 359, 360 పాటలు రెండూ పూర్వముద్రణమున తప్పిపోయినవి. 359వ పాట శుద్ధశృంగారసంకీర్తనములలో నుండదగినది. 360వ పాట వేదాంతవిషయోపమానములతో కూడిన శృంగారసంకీర్తనము.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము