Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 6-1
సంపుటము: 1-36
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
వైష్ణవులుగానివార లెవ్వరు లేరు
విష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గాన
॥వైష్ణవులు॥
అంతయు విష్ణు [1]మయం బట మరి దేవ-
తాంతరములు గలవననేలా
భ్రాంతిఁ బొంది [2]యీ భావము భావించి-
నంతనే పుణ్యులవుట దప్పదుగాన
॥వైష్ణవులు॥
యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరి
యెవ్వరిఁ దలచిన నేమి
అవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా-
రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు
॥వైష్ణవులు॥
అతిచంచలంబైన యాతుమ గలిగించు
కతమున బహుచిత్తగతులై
యితరులఁ గొలిచిన యెడయక యనాథ-
పతి తిరువేంకటపతి చేకొనుఁ గాక
॥వైష్ణవులు॥

[1] ‘మయఁబట’ అని రేకు.

[2] ‘యేభావ’ పూ.ము.పా., రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము