అధ్యాత్మ సంకీర్తన
రేకు: 69-4
సంపుటము: 1-361
రేకు: 69-4
సంపుటము: 1-361
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఎక్కడ చొచ్చెడి దీభవమేదియుఁ గడపల గానము వుక్కునఁ బరితాపానల మూదక మండెడిని | ॥ఎక్కడ॥ |
| హృదయవికారము మాన్పఁగ నేతెరఁగును సమకూడదు మదనానందము చెరుపఁగ మందేమియు లేదు పొదలిన దేహగుణంబులఁ బోనడువఁగ గతి గానము బ్రదికించిన కోరికెలకుఁ బ్రాయము దిరిగినది | ॥ఎక్కడ॥ |
| కమలిన యజ్ఞానం బిది కన్నులముందరఁ గానదు తిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదు తెమలని యాశాపాశము తెంపఁగ సత్వము చాలదు మమకారము వెడలింపఁగ మతి యెప్పుడు లేదు | ॥ఎక్కడ॥ |
| దురితంబులు పుణ్యంబులు తొడిఁబడ నాత్మనుఁ బెనగొని జరగఁగ శరీరధారికి సత్కర్మము లేదు తిరువేంకటగిరిపతియగు దేవశిఖామణిపాదము శరణని బ్రదుకుట దప్పను సన్మార్గము లేదు | ॥ఎక్కడ॥ |


