అధ్యాత్మ సంకీర్తన
రేకు: 6-2
సంపుటము: 1-37
రేకు: 6-2
సంపుటము: 1-37
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| మనసిజగురుఁ డితఁడో మరియుఁ గలఁడో వేద- వినుతుఁ డీతఁడు గాక వేరొకఁడు గలఁడో | ॥మనసిజ॥ |
| అందరికి నితఁడెపో అంతరాత్ముఁడనుచు- నందు రితఁడో మఱియు నవల నొకఁడో నందకధరుఁడు జగన్నాథుఁ డచ్చుఁతుడు గో- విందుఁ డీతఁడుగాక వేరొకఁడు గలఁడో | ॥మనసిజ॥ |
| తనర నిందరికిఁ [1]జైతన్యమొసఁగిన యాతఁ- డొనర నితఁడో మఱియు నొకఁడు గలఁడో దినకరశతతేజుఁడగు దేవదేవుఁడు త- ద్వినుతుఁ డితఁడుగాక వేఱొకఁడు గలఁడో | ॥మనసిజ॥ |
| పంకజభవాదులకుఁ బరదైవ మీతఁడని అంకింతు రితఁడో అధికుఁ డొకఁడో శాంకరీస్తోత్రములు సతతమునుఁ గైకొనెడి వేంకటవిభుఁడో కాక వేరొకఁడు గలఁడో | ॥మనసిజ॥ |
[1] ‘జేతన్య’ అని రేకు.


