అధ్యాత్మ సంకీర్తన
రేకు: 78-5
సంపుటము: 1-374
రేకు: 78-5
సంపుటము: 1-374
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా | ॥మిన్నక॥ |
| ఆవులు పేయలకుఁ గా నఱచీఁ బిదుకవలె గోవిందుఁడ యింక మేలుకొనవయ్యా ఆవలీవలి పడుచు లాటలు మరిగివచ్చి త్రోవ గాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా | ॥మిన్నక॥ |
| వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁ గూడియున్నా రిదే మేలుకోవయ్యా తోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకము యీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యా | ॥మిన్నక॥ |
| పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె కన్నుఁ- గొలుకులు నిచ్చి మేలుకొనవయ్యా అలరిన శ్రీవేంకటాద్రిమీఁది బాలకృష్ణ యిల మా మాటలు వింటి విఁక మేలుకోవయ్యా | ॥మిన్నక॥ |


