Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 78-6
సంపుటము: 1-375
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఇందునుండ మీ కెడ లేదు
సందడి సేయక చనరో మీరు
॥ఇందు॥
నాలుక శ్రీహరినామం బున్నది
తూలుచుఁ బారరో దురితములు
చాలి భుజంబున చక్రం బున్నది
తాలిమి భవబంధము లటు దలరో
॥ఇందు॥
అంతర్యామై హరి వున్నాఁ డిదె
చింతలు వాయరో చిత్తమున
వింతలఁ జెవులను విష్ణుకథ లివిగొ
పొంతఁ గర్మములు పోరో మీరు
॥ఇందు॥
కాపయి శ్రీవేంకటపతిపే రిదె
నాపై నున్నది నయమునను
కోపపు కామాది గుణములాల మీ-
రేపున కడఁగడ నెందైన బోరో
॥ఇందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము