Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 79-1
సంపుటము: 1-376
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
నీ యాజ్ఞ దల మోచి నీదేహధారి నైతి
యీ యెడ గోవిందుఁడ నే నీడేరే దెట్లో
॥నీ యాజ్ఞ॥
తనువు వేసరినాను తలఁపు వేసరదు
ధనము గడించెడి తరితీపున
చెనకి మగఁడు విడిచిన మామ విడువని
పనియాయ హరి నా బదుకుజాడ యెట్లో
॥నీ యాజ్ఞ॥
పాయము ముదిసినాను భావము ముదియదు
వేయైనా సంసారవిషయాలను
వోయయ్య కలివోసి నా వుట్లదిక్కు చూచేది
మాయదాయ నిఁక నా మనసు జాడెట్లో
॥నీ యాజ్ఞ॥
కడలేని నా విధులు కన్నులారఁ జూచి నీవు
నడుమ శ్రీవేంకటేశ నన్ను నేలితి
నొడుగులు దప్పినాను నోముఫలము దప్పని
అడియాల మబ్బె నాకు నానతిచ్చి తెట్లో
॥నీ యాజ్ఞ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము