Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 79-2
సంపుటము: 1-377
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
మేదిని జీవులఁ గావ మేలుకోవయ్యా
నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా
॥మేదిని॥
తగు గోపికల కన్నుఁ దామరలు [1]వికసించె
మిగుల సూర్యనేత్రుఁడ మేలుకోవయ్యా
తెగువ రాక్షసులనే తిమిరము విరియఁగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా
॥మేదిని॥
ఘనదురితపు నల్లఁగలువలు వికసించె
మినుకు[2] శశివర్ణుఁడ మేలుకోవయ్యా
పనివడి వేదాలనే పక్షులెల్లాఁ బలుకఁగ
[3]జనక(?) యాశ్రితపారిజాత మేలుకోవయ్య
॥మేదిని॥
వరలక్ష్మీకుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయు దోషరహిత మేలుకోవయ్యా
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేఁడు మేలుకోవయ్యా
॥మేదిని॥

[1] ‘వికసించ’ కావచ్చు.

[2] ‘శశినేత్రుఁడ’ కావచ్చు.

[3] ‘తండ్రీ’ అనునర్థములో జనకశబ్దము కావచ్చు. పూ.ము.పాఠములో ప్రశ్నార్థకచిహ్నమెట్లో?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము