అధ్యాత్మ సంకీర్తన
రేకు: 79-3
సంపుటము: 1-378
రేకు: 79-3
సంపుటము: 1-378
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఆతుమ సంతసపెట్టు టది యెఱుక, తా- నేతెరువు నొల్లకుండు టిదియే యెఱుక | ॥ఆతుమ॥ |
| ముంచిన బంధములలో ముణుఁగుడు వడక తా- నంచల విడఁదన్ను టది యెఱుక చంచలపు విషయాల సగ్గుడుముగ్గుడు గాక యెంచిఁ హరిఁ దలపోయు టిదియే యెఱుక | ॥ఆతుమ॥ |
| పాయని యర్థములకు బంటుబంటై తిరుగక ఆయతమై మోసపోని దది యెఱుక పాయపుఁ గామినులతోఁ బలుమారుఁ జేయు పొందు హేయమని తలపోయు టిదియే యెఱుక | ॥ఆతుమ॥ |
| ధరమీఁదఁ గల ప్రాణితతుల నొప్పించక అరయఁగ సముఁడగు టది యెఱుక గరిమల శ్రీవేంకటపతిదాసుఁడై యిరవొంద సుఖించు టిదియే యెఱుక | ॥ఆతుమ॥ |


