Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 6-3
సంపుటము: 1-38
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు-
నప్పఁడగు తిరువేంకటాద్రీశుఁ గంటి
॥ఇప్పుడిటు॥
[1]అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపురప్రభలు గంటి
శతకోటిసూర్యతేజములు వెలుఁగఁగఁ గంటి
చతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి
॥ఇప్పుడిటు॥
కనకరత్నకవాటకాంతు లిరుగడఁ గంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమమణిమయమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గక్కన మేలుకంటి
॥ఇప్పుడిటు॥
అరుదైన శంఖచక్రాదు లిరుగడఁ గంటి
సరిలేని అభయహస్తము[2] గంటిని
తిరువేంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటి
హరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి
॥ఇప్పుడిటు॥

[1] ‘అతిశయఁబైన’ అని రేకు.

[2] ‘స్తమును గంటి’ అని యుండవచ్చు. మొదటినుండి అనుక్రమమట్లే యున్నది.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము