Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 6-4
సంపుటము: 1-39
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
తీపనుచు చేఁదు తెగఁ దిని వెనకఁ బడరాని-
ఆపదలచేతఁ బొరలాడేము [1]గాన
॥తీపనుచు॥
అప్పుదీరినదాఁకా నలవోక కైనవా-
రెప్పుడునుఁ దమవార లేలౌదురు
అప్పటప్పటికిఁ బ్రియ మనుభవింపుచు మమత
చెప్పినటువలెఁ దాము సేయవలెఁ గాక
॥తీపనుచు॥
పొందైనవారమని పొద్దు [2]వోకకుఁ దిరుగు
యిందరునుఁ దమవార లేలౌదురు
కందువగు తమకార్యగతులు దీరినదాఁక
సందడింపుచుఁ బ్రియము జరపవలెఁ గాక
॥తీపనుచు॥
తెగని కర్మము దమ్ముఁ దిప్పుకొని తిరిగాడ
అగడుకోరిచి పెక్కులాడ నేమిటికి
తగు వేంకటేశ్వరునిఁ దలఁచి యిన్నిటాఁ దాము
విగతభయులయి భ్రాంతి విడువవలెఁ గాక
॥తీపనుచు॥

[1] ‘గాక’ కావచ్చు.

[2] ‘పోదైన’అని రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము