Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 6-5
సంపుటము: 1-40
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
అదిగాక నిజమతం బదిగాక యాజకం-
బదిగాక హృదయసుఖ మదిగాక పరము
॥అది॥
అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు
నమరినది సంకల్పమను మహాపశువు
ప్రమదమను యూపగంబమున విశసింపించి
[1]విమలేందు(ద్రి?) యాహుతులు వేల్పంగవలదా
॥అది॥
అరయ నిర్మమకార మాచార్యుఁడై చెలఁగ
వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాఁగ
దొరకొన్న శమదమాదులు దానధైర్యభా-
స్వరగుణాదులు విప్రసమితి గావలదా
॥అది॥
తిరువేంకటాచలాధిపు నిజధ్యానంబు
నరులకును సోమపానంబు గావలదా
పరగ నాతని కృపాపరిపూర్ణజలధిలో
నరుహులై యవబృథం [2]బాడంగవలదా
॥అది॥

[1] పూ.ము. పరిష్కర్తలు సవరణములందంతట ఇట్లు చూపియుండిన చాల బాగుండెడిది.

[2] ‘బాడఁగ’ అని రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము