Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 85-4
సంపుటము: 1-414
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
నిత్యులు ముక్తులు నిర్మలచిత్తులు నిగమాంతవిదులు వైష్ణవులు
సత్యము వీరల శరణని బ్రదుకరో సాటికిఁ బెనఁగక జడులాల
॥నిత్యులు॥
సకలోపాయశూన్యులు సమ్యగ్జ్ఞానపూర్ణులు
అకలంకులు శంఖచక్రలాంఛను లన్నిటఁ బూజ్యులు వైష్ణవులు
వొకటీఁ గోరరు వొరులఁ గొలువరు వొల్లరు బ్రహ్మాదిపట్టములు
అకటా వీరల సరియనఁ బాపం బారుమతంబుల పూఁతకోకలన్
॥నిత్యులు॥
మంత్రాంతరసాధనాంతరంబులు మానిన పుణ్యులు విరక్తులు
యంత్రపు మాయలఁ బొరలు పరులకు యెంతైనా మొక్కరు వైష్ణవులు
తంత్రపు కామక్రోధవిదూరులు తమ నిజధర్మము వదలరు
జంత్రపు సంసారులతో వీరల సరియని యెంచఁగఁ బాపమయ్య
॥నిత్యులు॥
తప్పరు తమ పట్టినవ్రత మెప్పుడు దైవ మొక్కడేఁ గతియనుచు
వొప్పగు తమ పాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు
కప్పిన శ్రీవేంకటపతిదాసులు కర్మవిదూరులు సాత్వికులు
చెప్పకుఁ డితరుల సరిగా వీరికి సేవించఁగ నే ధన్యుఁడనైతి
॥నిత్యులు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము