అధ్యాత్మ సంకీర్తన
రేకు: 94-2
సంపుటము: 1-466
రేకు: 94-2
సంపుటము: 1-466
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేల యెదలో నీవుండఁగా నితరములేలా | ॥మొదలు॥ |
| నిగమమార్గముననే నడచేనంటే నిగమములెల్లను నీ మహిమే జగము లోకులఁ జూచి జరగెదనంటే జగములు నీ మాయ[1]జనకములు | ॥మొదలు॥ |
| మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండేనంటే మనసు కోరికలు నీ మతకాలు తనువు నింద్రియములు తగ గెలిచేనంటే తనువు నింద్రియములు దైవమ నీ మహిమ | ॥మొదలు॥ |
| యింతలోని పనికిఁగా యిందు నందుఁ జొరనేల చెంత నిండుచెరువుండ చెలమలేలా పంతాన శ్రీవేంకటేశ పట్టి నీకే శరణంటి సంతకూటాల ధర్మపుసంగతి నాకేలా | ॥మొదలు॥ |
[1] ‘జనితములు’ కావచ్చు.


