అధ్యాత్మ సంకీర్తన
రేకు: 7-6
సంపుటము: 1-47
రేకు: 7-6
సంపుటము: 1-47
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| పాయని [1]కర్మంబులె కడుబలవంతము లనినప్పుడె కాయమునకు జీవునకునుఁ [2]గర్తృత్వము లేదు | ॥పాయని॥ |
| ఆతుమ సకలవ్యాపకమని తలపోసిన పిమ్మట జాతియుఁ గులాభిమానముఁ జర్చింపనె రాదు భూతవికారములన్నియుఁ బురుషోత్తముఁ డనినప్పుడు పాతకముల పుణ్యంబుల పని తనకే లేదు | ॥పాయని॥ |
| పదిలంబుగ సర్వాత్మకభావము దలఁచిన పిమ్మట ముదమున నెవ్వరిఁ జూచినఁ మొక్కక పోరాదు కదిసిన యిప్పటి సుఖములె కడుదుఃఖములని తెలిసిన చెదరక సంసారమునకు జేసాఁపనె రాదు | ॥పాయని॥ |
| పరిపూర్ణుఁడు తిరువేంకటపతియనఁగా వినినప్పుడు యెరవుల హీనాధికములు యెగ్గులు మరి లేవు పరమాత్ముండగు నీతని భక్తులం దలఁచిన యప్పుడు తిరముగ నీతనికంటెను దేవుఁడు మరి లేఁడు | ॥పాయని॥ |
[1] ‘కర్మఁబులె’ అని రేకు. ‘కర్మములే’ అని పూ.ము.పా.
[2] ‘గర్తత్వము’ అని రేకు.


