Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 95-1
సంపుటము: 1-471
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఎక్కెఁగా రాఁగా రాఁగా యిందాఁకాఁ దగులు
యిక్కువ శ్రీహరిమాయ నింకనెంతో తగులు
॥ఎక్కెఁగా॥
తెగని కర్మమునకు దేహము దగులు
తగిన దేహమునకు తరుణితో తగులు
సొగిసి యా రెంటికి సుతులొక్క తగులు
అగడాయఁ గనకము అన్నిటితో తగులు
॥ఎక్కెఁగా॥
యింతటి సంసారికి యిల్లొక్క తగులు
బంతికి [1]నందు గలిగె పాఁడిపంట తగులు
చెంత నీ లంపటానకు క్షేత్రము తగులు
సంతగూడే దాసదాసీజనులెల్లా దగులు
॥ఎక్కెఁగా॥
మొదల జీవుఁ డొక్కఁడే మోపులాయఁ దగులు
వదలని బంధములు వడ్డివారెఁ దగులు
వుదుటిహముఁ బరము నొక్కయందె తగులు
అదె శ్రీవేంకటపతి యంతరాత్మ తగులు
॥ఎక్కెఁగా॥

[1] ‘నందుఁ గలిగె’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము