అధ్యాత్మ సంకీర్తన
రేకు: 7-7
సంపుటము: 1-48
రేకు: 7-7
సంపుటము: 1-48
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఏడ [1]సుజ్ఞాన మేడ తెలివి నాకు బూడిదిలో హోమమై పోయఁ గాలము | ॥ఏడ॥ |
| ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడినని కదిసిన యాసచేఁ గడవలేక యెదురు చూచి చూచి [2]యెలయించి యెలయించి పొదచాటుమృగమై పోయఁ గాలము | ॥ఏడ॥ |
| ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని వింతవింత వగలచే వేఁగి వేఁగి చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని పొంతనున్న వెన్నయై పోయఁ గాలము | ॥ఏడ॥ |
| యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని యెక్కడికైనా నూర కేఁగియేఁగి గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక పుక్కిటి పురాణమయి పోయఁ గాలము | ॥ఏడ॥ |
[1] ‘సుగ్ఞాన’ అని రేకు.
[2] ‘యెలఇంచి యెలఇంచి’ అని రేకు.


