Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 98-6
సంపుటము: 1-494
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఇందిరాపతి మాయలు యింతులు సుండీ
మందలించి హరిఁ గొల్చి మనుదురుగాని
॥ఇందిరా॥
అతివల చూపులే ఆయాలు దాఁకీఁ జుండీ
జితమైన పులకల జిల్లులౌఁ జుండీ
రతిపరవశములు రాఁగిన మూర్ఛలు సుండీ
మతిలోఁ దప్పించుక మనుదురుగాని
॥ఇందిరా॥
మెఱయించే చన్నులే మించుఁ బెట్లుగుండ్లు సుండీ
మెఱుఁగు మోవులే మచ్చుమేపులు సుండీ
మఱి మంచిమాటలు మాయపుటురులు సుండీ
మఱవక తప్పించుక మనుదురుగాని
॥ఇందిరా॥
బలుసంసారపు పొందు పాముతోడి పొత్తు సుండీ
వెలలేని వలపులు విషము సుండీ
యెలమితో శ్రీవేంకటేశ్వరు మఱఁగు చొచ్చి
మలయుచు సొలయుచు మనుదుచుగాని
॥ఇందిరా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము