Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 99-2
సంపుటము: 1-496
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను
పొనిఁగి వొరులకైతే బోధించే నేను
॥కనిన॥
ధరణిఁ గర్మము గొంత తగిన జ్ఞానము గొంత
సరికి సరే కాని నిశ్చయము లేదు
వొరిమె యెంచి చూచితే నొకటివాఁడాఁ గాను
సరవి దెలియ కేమో చదివేము నేము
॥కనిన॥
యీతల నిహము గొంత యింతలోఁ బరము గొంత
చేతులు రెండు చాఁచే చిక్కుట లేదు
యీ తెరువులో నొకటి నేరుపరచుకోలేను
కాతరాన కతలెల్లా గఱచితి నేను
॥కనిన॥
దైవిక మొకకొంత తగు మానుషము గొంత
చేవలు చిగురువలెఁ జేసేను
యీవల శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గాచె
భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను
॥కనిన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము