Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 99-5
సంపుటము: 1-499
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
ఎట్టయినాఁ జేయుము యిఁక నీ చిత్తము
కిట్టిన నీ సంకీర్తనపరుఁడ
॥ఎట్టయునా॥
కొందరు జ్ఞానులు కొందరు భక్తులు
కొందరు వైరాగ్యకోవిదులు
యిందరిలో నే నెవ్వఁడఁ గా నిదె
సందడి హరి నీ శరణాగతుఁడ
॥ఎట్టయునా॥
జపితలు గొందరు శాస్త్రులు గొందరు
ప్రపత్తిఁ గొందరు బలువులు
వుపమించఁగ [1]ని న్నొకఁడా గా నిందు
కపురుల నీ డింగరీఁడ నేను
॥ఎట్టయునా॥
ఆచార్యపురుషులు అవ్వలఁ గొందరు
యేచిన సమయులై యేర్పడిరి
కాచేటి శ్రీవేంకటపతి నేనైతే
తాచి నీ దాసుల దాసుఁడను
॥ఎట్టయునా॥

[1] ‘నేనొకఁడా’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము