అధ్యాత్మ సంకీర్తన
రేకు: 8-2
సంపుటము: 1-50
రేకు: 8-2
సంపుటము: 1-50
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| జీవాతుమై యుండు చిలుకా నీ- వావలికి [1]పరమాత్ముఁడై యుండు చిలుకా | ॥జీవాతుమై॥ |
| ఆతుమపంజరములోన నయముననుండి నాచేతనే పెరిగిన చిలుకా జాతిగాఁ గర్మపుసంకెళ్ళఁ బడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా భాతిగాఁ జదువులు పగలు రేలును నా చేత నేరిచినట్టి చిలుకా రీతిగా దేహంపు రెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా | ॥జీవాతుమై॥ |
| బెదరి [2]అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ [3]జెదరఁగఁ జూతువే చిలుకా అదయు[4]లయ్యిన శత్రులారుగురికిఁ గాక అడిచిపడుదువే నీవు చిలుకా వదల కిటు [5]యాహారవాంఛ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకా తుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁగూడి మెలగిన చిలుకా | ॥జీవాతుమై॥ |
| నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ జిలుకా శ్రీవేంకటాద్రిపై చిత్తములో నుండి సేవించు[6]కొని గట్టి చిలుకా దైవమానుషములు తలఁపించి యెపుడు నా తలఁపునఁ బాయని చిలుకా యేవియును నిజము గావివి యేఁటికని నాకు నెఱిఁగించినటువంటి చిలుకా[7] | ॥జీవాతుమై॥ |
[1] ‘వావలికిఁ బర’అని పూ.ము.పా.
[2] ‘యైదుగురికిని’ అని పూ.ము.పా.
[3] ‘జెదరంగ’ అని పూ.ము.పా.
[4] ‘లైన’ పూ.ము.పా.
[5] ‘లాహార’ అని పూ.ము.పా.
[6] ‘కొను’ లేక ‘కొనునట్టి’ కావచ్చు.
[7] ఇది పెద్దపాట. దీనిలో ప్రతిచరణము రెండుపంక్తుల కొకపాదముగ గుర్తింపవలెను. తొలిచరణము నాలుగుపంక్తులకే ‘జీవా’ అను పల్లవి గ్రహణము పొరపాటుగ పడినది.


