Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 104-3
సంపుటము: 2-21
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు
యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు
॥పల్లవి॥
పట్టఁ బసలేదు చూడ బయలుగాదీమనసు
నెట్టనఁ బారుచునుండు నీరూఁ గాదీమనసు
చుట్టిచుట్టి పాయకుండుఁ జుట్టమూఁ గాదీమనసు
యెట్టనెదుటనే వుండు నేఁటిదో యీమనసు
॥కంచూఁ॥
రుచు లెల్లాఁ గానుపించు రూపు లేదు మనసు
పచరించు నాసలెల్లాఁ బసిఁడి గాదీమనసు
యెచటాఁ గరఁగదు రాయీఁ గాదు మనసు
యిచటా నచటాఁ దానే యేఁటిదో యీమనసు
॥కంచూఁ॥
తప్పక నాలోనుండు దైవముఁ గాదు మనసు
కప్పిమూఁటగరాట్టదు గాలీఁ గాదు మనసు
చెప్పరానిమహిమలశ్రీవేంకటేశుఁ దలఁచి
యిప్పుడిన్నిటా గెలిచె నేఁటిదో యీమనసు
॥కంచూఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము