Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 116-2
సంపుటము: 2-92
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఇద్దరు దేహసమ్మంధ మిదివో మాయ
గద్దించి యాడవుండునో కడసారీ తాను
॥పల్లవి॥
తోడఁబుట్టిన మమత తొడఁగి కొన్నాళ్లకు
వాడికె పుత్రులమీఁదవలె నుండదు
వేడుక వారెవ్వరో వీరెవ్వరో కాని
కూడపెట్టీ వీరికే కొట్లాడీ వారికే
॥ఇద్ద॥
తల్లిమీఁదఁ గలభక్తి తనకే కొన్నాళ్లకు
యిల్లాలుమీఁదవలె నింత వుండదు
వెల్లవిరి నది యెంత విచారించ నిది యంత
యిల్లుముంగి లొక్కరిది యెరవు వొక్కరిది
॥ఇద్ద॥
నీతితో శ్రీవేంకటేశు నిత్యసేవ కొన్నాళ్ల-
కీతల సంసారమంత యితవు గాదు
ఆతఁడెట్టు యివియెట్టు అందరూ నెఱిఁగినదే
చేతు లొకటిమీఁదట చిత్త మొకయందు
॥ఇద్ద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము