అధ్యాత్మ సంకీర్తన
రేకు: 11-1
సంపుటము: 1-67
రేకు: 11-1
సంపుటము: 1-67
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీ- యలవాటు సేసె నీవుయ్యాల పలుమారు [1]నుచ్ఛ్వాసపవనమందుండ నీ- భావంబు దెలిపె నీవుయ్యాల | ॥అలర॥ |
| ఉదయాస్తశైలంబు లొనరఁ గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబు నిండె నీవుయ్యాల పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల | ॥అలర॥ |
| మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల నీలశైలమువంటి నీమేనికాంతికిని నిజమైన తొడవాయె నుయ్యాల పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల | ॥అలర॥ |
| కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ముఁ గౌఁగిలింపఁగఁ జేసె నుయ్యాల అమరాంగనలకు నీ హావభావ విలాసమందంద చూపె నీవుయ్యాల కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల [2]కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె నుయ్యాల | ॥అలర॥ |
[1] ‘నుశ్వాస’ అని రేకు. ‘ఉయ్యాల’ పదము రేకునందంతటా ‘ఉయ్యాలా’ అనియే వున్నది.
[2] ‘కమనియ్య’ అని రేకు.


