అధ్యాత్మ సంకీర్తన
రేకు: 11-2
సంపుటము: 1-68
రేకు: 11-2
సంపుటము: 1-68
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| ఘోరవిదారణ నారసింహ నీ- వీ రూపముతో నెట్లుండితివో | ॥ఘోర॥ |
| ఉడికెడి కోపపుటూర్పులఁ గొండలు పొడివొడియై నభమున కెగయ బెడిదపు రవమున పిడుగులు దొరుగఁగ యెడనెడ నీవపు డెట్లుండితివో | ॥ఘోర॥ |
| కాలానలములు గక్కుచు నయన- జ్వాలల నిప్పులు చల్లుచును భాలాక్షముతో బ్రహ్మాండకోట్ల- కేలికవై నీవెట్లుం[1]డితివో | ॥ఘోర॥ |
| గుటగుటరవములు కుత్తికఁ గులుకుచు గిటగిటఁ బండ్లు గీఁటుచును తటతటఁ బెదవులు దవడలు వణఁకఁగ ఇటువలె నీవపుడెట్లుండితివో | ॥ఘోర॥ |
| గోళ్ళ మెఱుఁగుల కొంకుల పెదపెద- వేళ్ళ దిక్కులు వెదకుచును నీళ్ళతీగెలు [2]నిగుడఁగ [3]నోర ను- చ్చిళ్ళు [4]గమ్మఁగ నెట్లుండితివో | ॥ఘోర॥ |
| హిరణ్యకశిపుని నేపడఁచి భయం- కరరూపముతోఁ గడుమెరసి తిరువేంకటగిరిదేవుఁడ [5]నీవిఁక యిరవుకొన్న నాఁడెట్లుండితివో | ॥ఘోర॥ |
[1] నిడురేకు 11లోని పాఠము- నాఁడెట్లుండి.
[2] నిడురేకు 11లోని పాఠము- నిగిడి.
[3] నిడురేకు 11లోని పాఠము- నోర.
[4] నిడురేకు 11లోని పాఠము- గారఁగ.
[5] నిడురేకు 11లోని పాఠము- డవై యిందిరవుకొంటి.


