అధ్యాత్మ సంకీర్తన
రేకు: 12-3
సంపుటము: 1-74
రేకు: 12-3
సంపుటము: 1-74
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఎవ్వఁడో కాని యెరఁగరాదు [1]కడు- దవ్వులనే వుండు తలంపులోనుండు | ॥ఎవ్వఁడో॥ |
| [2]ఎడయవు తన రెక్క లెగసిపోలేఁడు కడు దాఁగుఁ గాని దొంగయుఁ గాడు వడిఁ గిందుపడును సేవకుఁడునుఁ గాఁడు వెడఁగుగోళ్ళు వెంచు విటుఁడునుఁ గాఁడు | ॥ఎవ్వఁడో॥ |
| మిగులాఁ బొట్టివాఁడు మింటికినిఁ బొడవు జగడాలు తపసివేషములును మగువకై పోరాడు మరి విరక్తుఁడును తగుఁ గాపుఁబనులు నెంతయుఁ దెల్లఁదనము | ॥ఎవ్వఁడో॥ |
| తరుణుల వలపించు తగిలి పై కొనఁడు తురగముఁ దోలు రౌతునుఁ గాఁడు తిరువేంకటాద్రిపైఁ దిరుగు నెప్పుడును పరమమూర్తియై పరగు నీఘనుడు | ॥ఎవ్వఁడో॥ |
[1] నిడురేకు 43 - కడుఁగడు.
[2] ఇందు దశావతారసమన్వయము కలదు.


