అధ్యాత్మ సంకీర్తన
రేకు: 154-5
సంపుటము: 2-256
రేకు: 154-5
సంపుటము: 2-256
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| ఇన్నాళ్లు నందునందు నేమి గంటిని అన్నిటా శరణు చొచ్చి హరి నిన్నుఁ గంటిని | ॥పల్లవి॥ |
| అంగనల పసఁజిక్కి అలయికలే కంటి బంగారువెంటఁ దగిలి భ్రమ గంటిని ముంగిటిక్షేత్రాలంటి ముంచి వెట్టిసేయఁ గంటి అంగపు నన్నే చూచి అంతరాత్మఁ గంటి | ॥ఇన్నా॥ |
| చుట్టాలఁ జేరి చూచి సుద్దులవావులు గంటి మట్టులేని వయసుతో మదము గంటి వట్టికామములుసేసి వరుస మాయలు గంటి పట్టి నారాయణాయని భక్తి నిన్నుఁ గంటిని | ॥ఇన్నా॥ |
| వింతచదువులవల్ల వేవేలుమతాలు గంటి సంతకర్మములవల్ల సాము గంటిని యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము చింతించి అందులోన నీ శ్రీపాదాలు గంటి | ॥ఇన్నా॥ |


