Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 155-1
సంపుటము: 2-257
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
సొరిది మమ్మిట దయఁజూతువు గాకా
వెరసి మరి యెక్కడా నేమి విన్నవించే మిఁకను
॥పల్లవి॥
తలఁచితి నీరూపము తగిలితి నీపాదాలు
కలసితి నీదాసుల గమిలోనను
చలివాసె భవములు సడిదీరెఁ గర్మములు
యెలమి నీమహిమలు యేమి చెప్పే మిఁకను
॥సొరి॥
నీముద్రలు ధరించితి నీగుణాలు వొగడితి
చేముట్టి పూజించితి శ్రీయంగాలు
తామసములెల్లా నూడె తతివచ్చె సాత్వికము
గోమున మరేమి నిన్ను కొసరే మిఁకను
॥సొరి॥
తిరుమణి ధరించితి తీర్థపస్రాదాలు గొంటి
విరవైన నీకథలు వీనుల వింటి
పరగ శ్రీవేంకటేశ పరము నిహముఁ గంటి
అరసి యితర మేమి ఆశపడే మిఁకను
॥సొరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము