అధ్యాత్మ సంకీర్తన
రేకు: 13-1
సంపుటము: 1-77
రేకు: 13-1
సంపుటము: 1-77
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| ఏఁటివిజ్ఞాన[1] మేఁటిచదువు గూఁటఁబడి వెడలుగతి గురుతు గనలేఁడు | ॥ఏఁటి॥ |
| ఏడుమడుకల చర్మ మింతయునుఁ దూంట్లై[2] గాడఁబెట్టుచుఁ జీము గారఁగాను పాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణి[3] వీడఁదన్నుక చనెడి వెరవు గనలేఁడు | ॥ఏఁటి॥ |
| కడుపు నిండిన మహాకష్టంబు నలుగడల వెడలుచును బెనుమురుకి వేయఁగాను యిడుమఁ బొందుచు [4]సుఖంబిందుకే వెదకీని వొడలు మోవఁగ జీవుఁ డోపననలేఁడు | ॥ఏఁటి॥ |
| వుదకమయమగు కన్ను లురికి యేమైనఁ గని మదవికారము మతికి మరుపఁగాను యిది యెరిఁగి తిరువేంకటేశుఁ గని జీవుఁడా- సదమలానందంబు చవి గానలేఁడు | ॥ఏఁటి॥ |
[1] నిడురేకు 4- సుజ్ఞాన.
[2] నిడురేకు 4- దూంట్లను.
[3] నిడురేకు 4- దేహంబు బ్రదుకఁ గోరీఁ గాని.
[4] ‘సుఖము యిందు’ అని రేకు.


