Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 164-5
సంపుటము: 2-310
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
దైవమా నీ వొక్కఁడవే దక్కిన ధనము గాక
యీవలానావలా మఱి యెంచ నేమున్నది
॥పల్లవి॥
పుట్టినవారికెల్లా పొత్తుల దీజగము
మెట్టికూచుండే యరఁగు మేదినియల్లా
బట్టబయటి భోగాలు బంతికూటిబోజనాలు
పట్టి తమపని యేరుపరచ నేమున్నది
॥దైవ॥
పంచుకొన్నభాగాలు పంచమహాభూతాలు
పంచేంద్రియములే పరివారాలు
యెంచి నడచేకాలమే యిందరికి నుంబళి
తెంచి యెచ్చుకుందు లిందుఁ దెలుప నేమున్నది
॥దైవ॥
మనోవికారాలు మానుషపు టెఱుకలు
వినోదమాత్రాలు వేడుకలెల్లా
యెనలేని శ్రీవేంకటేశ నీమహిమ లివి
వెనకా ముందరా విన్నవించ నేమున్నది
॥దైవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము