Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 164-6
సంపుటము: 2-311
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఇట్టివాఁడవు సులభమెట్లా నైతివో కాక
అట్టి నీదయ దలఁచి అరుదయ్యీ నాకు
॥పల్లవి॥
యేమేమి చదువవలె నెందరి నడుగవలె
ఆముక నిన్నుఁ దెలిసే యందుకొరకు
భూమిలోన నెంతేసి పుణ్యములు సేయవలె
కామించి నీపై భక్తి గలిగేటికొరకు
॥ఇట్టి॥
యెన్నిజన్మా లెత్తవలె నెందెందు వెదకవలె
కన్నుల నీసాకారము గనేకొరకు
వున్నతి నెంతగాలము వొగ్గి కాచుకుండవలె
విన్నవించి నీసేవ వేఁడుకొనేకొరకు
॥ఇట్టి॥
యేదేది యెఱఁగవలె యెట్లభ్యసించవలె
నీదాసుఁ డనిపించుకొనేటికొరకు
సాదరాన శ్రీవేంకటేశ్వర నన్ను మన్నించితి-
వేదెసఁ బొగడవలె యింత సేసేకొరకు
॥ఇట్టి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము