Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 165-1
సంపుటము: 2-312
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
చెప్పితేఁ బాసునందురు చేసిన దోసములెల్లా
వొప్పుగొని మన్నించ నుచితమౌ నీకు
॥పల్లవి॥
క్షమియించుకొనవే సర్వాపరాధములు
క్రమ మెఱఁగ కేమేమి గావించితినో
రమణతో సర్వలోకరక్షకుఁడవట నీవు
తమితోడ నన్నుఁ గావఁ దగవౌను నీకు
॥చెప్పి॥
పరిహరించఁగదవే బహునరకబాధలు
గరిమల నెటువలెఁ గాచుకున్నవో
అరుదుగా సురల మొరాలించితివట తొల్లి
ధర నన్ను వహించుకోఁ దగవౌను నీకు
॥చెప్పి॥
వెనుకొని యడ్డము రావే శ్రీవేంకటేశ్వర
అనుభవించే కర్మము లవేమున్నవో
పనివడి భక్తపరిపాలకుఁడవట నీకు
తనుభోగాలు భోగించఁ దగవౌను నీవు
॥చెప్పి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము