అధ్యాత్మ సంకీర్తన
రేకు: 165-2
సంపుటము: 2-313
రేకు: 165-2
సంపుటము: 2-313
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| అతఁడు లోకోన్నతుఁ డాదిమపురుషుఁడు అన్నిటాను పరిపూర్ణుఁడు చతురుఁడితఁడే రక్షించఁగలవాఁడు శరణని బ్రదుకవో వో మనసా | ॥పల్లవి॥ |
| మరుతండ్రిఁ జూచిన మంచికన్నులను మరొకరిఁ జూచిన నింపౌనా సిరువరు నామమునొడిగిన నోరను చిక్కిన పేరులు యితవౌనా పరమాత్ముఁ దలచిన మనసులోపలను పరులఁ దలఁచితే నొడంబడునా కరుణానిధి పుణ్యకథలువినిన చెవుల కడలసుద్దులు విన సమ్మతించునా | ॥అతఁ॥ |
| నరహరిఁ బూజించినయట్టి కరములు నరుల సేవసేయ నరుహములా మురహరు శరణని మొక్కిన శిరసున మూఢులకు మొక్క నుచితములా హరిమందిరమున కరిగెడు పదములు అధములిండ్ల కేఁగఁగ నలవడునా పురుషోత్తము లాంఛనము మోచిన మేను భువి హీనవృత్తికిఁ బొసఁగీనా | ॥అతఁ॥ |
| గోవిందుఁడే దిక్కై వుండు ఘనులకు కొలిపీనా దేవతాంతరంబులు భూవల్లభుదెసఁ బుట్టిన జ్ఞానము పొంది వేరొకట నిలిచీనా శ్రీవేంకటపతిపై నిడిన భక్తి చెలులపై నునుపఁగఁ దగవవునా దేవకినందనుఁ డితనిదాసులఁ దెలియఁగ జడులకుఁ దరమయ్యీనా | ॥అతఁ॥ |


