Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 169-4
సంపుటము: 2-336
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
నీవే దయదలఁచుక నెమ్మి రక్షించుట గాక
యీవలఁ గొలిచేనంటే యీడైనవాఁడనా
॥పల్లవి॥
పరగ నేమైనా విన్నపము చేసుకొనేనంటే
హరి నీకు నెదురుమాఁటాడేవాఁడనా
గరిమ సువస్తువులు కానుక ఇచ్చేనంటే
సరుస నీకన్నా నేను సంపన్నుఁడనా
॥నీవే॥
మెలఁగి నీగుణాలకు మెచ్చి సంతోషించేనంటే
జలజాక్ష నే నీతో సరివాఁడనా
బలువైనా నీపరమపదము గోరేనంటే
వలనైన నీతోడివంతువాఁడనా
॥నీవే॥
తాలిమితో నాలో నిన్ను ధ్యానము సేసేకంటే
పాలఁసుడ నేను నీపాటివాఁడనా
యేలితివి శ్రీవేంకటేశ నన్నుఁ గృపతోడ
యీలీల నీమహిమలు యెరిఁగేటివాఁడనా
॥నీవే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము