Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 170-3
సంపుటము: 2-341
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
అందుకే సుమ్మీ నేఁ జేసే‌ ఆచారాలు దైవమా
నిందవాయ నా మనసు నీపై నిలుపవే
॥పల్లవి॥
బట్టబయటఁ దోలితేను బందె మేయుఁ బసురము
పట్టి మేపితేను తనపనులు సేయు
ఇట్టె వదిలితేను యెందైనాఁ బారు మనసు
కట్టుక నే మఁస్తుడైతే కైవసమై యుండును
॥అందు॥
బడి దప్పితే బంట్లు పరదేసు లౌదురు
యెడయక కూడుకొంటే హితు లౌదురు
విడిచితే నిటులానే కడకుఁ బారు మనసు
వొడలిలో నణఁచితే వొద్దికై వుండును
॥అందు॥
చే వదలితే పెంచిన చిలుకైనా మేడ లెక్కు
రావించి గూఁటఁ బెట్టితే రామా యనును
భావించకుండితే యిట్టె పారు నెందైనా మనసు
శ్రీవేంకటేశుఁ గొల్చితే చేతఁ జిక్కి వుండును
॥అందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము