అధ్యాత్మ సంకీర్తన
రేకు: 170-5
సంపుటము: 2-343
రేకు: 170-5
సంపుటము: 2-343
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళవసంతం
| అందరి రక్షించే దేవుఁ డాదరించీ జీవులను పొందుగా యీమేలెరిఁగి పొగడరో లోకులు | ॥పల్లవి॥ |
| వనము వెట్టినవాఁడు వాఁడకుండా నీరు వోసి పెనచి కలుపు దీసి పెంచినయట్లు పనివడి గొల్లవాఁడు పచ్చికపట్టునఁ బసుల తనియఁగ నిల్పి నిల్పి తానే మేపినట్లు | ॥అంద॥ |
| కన్నతల్లి బిడ్డలకు కానుక వెన్నయుఁ బాలు- నన్నము నిడి రక్షించినటువలెను యెన్నఁగ బంట్లనేలే యేలిక జీతాలు వెట్టి మన్నించి కాచుకొని మనిపినయట్లు | ॥అంద॥ |
| వసుధ వైద్యుఁడైనవాడు మందుమాకు లిచ్చి పొసఁగ దేహధారులఁ బోషించినట్లు యెసఁగ శ్రీవేంకటేశుఁ డితఁడే విశ్వకుటింబి పసగా వరము లిచ్చి భావించీనట్లు | ॥అంద॥ |


