Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 171-1
సంపుటము: 2-344
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
ఎఱఁగక వేసారు నిల జీవుఁడు
మెఱసి నిండుకున్నాఁడు మేఁటి యీదేవుఁడు
॥పల్లవి॥
వూరకే పరాకైనట్టుండును దేవుఁడు
నారుకొన మతిలోఁ దనపైనే చింత
గారవాన మరి పలుకనియట్టే వుండును
యీరీతి మాటాడించేవాఁ డిన్నిటా నితఁడే
॥ఎఱఁ॥
యెందు లేనియట్టే వుండు నెంచి చూచితే దేవుఁడు
చెంది లోకశరీరియై చెలరేఁగీని
అందరాక యెక్కడాను అడఁగినట్లనే యుండు
యిందరిఁ బోషించేవాఁడు యెప్పుడూ నితఁడే
॥ఎఱఁ॥
చేరి లోనుగానెట్టుండు శ్రీవేంకటేశదేవుఁడు
కోరినవరము లిచ్చు గురుతుగాను
వారక యలమేల్మంగ వల్లభుఁ డిట్టిదేవుఁడు
యీరూపుతో నుండు నిందరిలో నితఁడే
॥ఎఱఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము